తెలంగాణ ప్రజలకు శుభవార్త.. రేపటి నుంచి బస్సులు రైట్ రైట్!

TSRTC Telangana Corona Virus KCR

కోవిడ్-19 భయంతో ఇన్నాళ్లూ ఇళ్లకే పరిమితమైన తెలంగాణ ప్రజలకు ఇది కొంత ఊరటనిచ్చే వార్తే. ఆర్టీసీ బస్సులు రేపటి నుంచి మళ్లీ రోడ్డెక్కనున్నాయి. లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు పొడిగించిన కేంద్రం అందుకు సంబంధించిన మార్గదర్శకాలను నిన్న విడుదల చేసింది. బస్సు సర్వీసుల విషయంలో నిర్ణయాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. ఈ నేపథ్యంలో బస్సులు నడిపించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

నేటి సాయంత్రం ఐదు గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. బస్సు సేవలను పునరుద్ధరించడంతోపాటు లాక్‌డౌన్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

రేపటి నుంచి బస్సులు నడపాలని నిర్ణయించిన ప్రభుత్వం నిన్న రాత్రే ఈ విషయాన్ని ఆర్టీసీకి సమాచారం అందించింది. ఈ నేపథ్యంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ అధ్యక్షతన ఆర్టీసీ ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. ఇందులో బస్సుల నిర్వహణ ప్రణాళికను సిద్ధం చేసి, సాయంత్రం కేసీఆర్ సారథ్యంలో జరగనున్న సమావేశంలో నివేదించనున్నారు.

నిజానికి 50 శాతం బస్సులు నడిపేందుకు కేంద్రం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. కరోనా వ్యాప్తి భయంతో ఆర్టీసీ ముందుకు రాలేదు. ఇప్పుడు గ్రీన్, ఆరెంజ్ జోన్ల సంఖ్య పెరుగుతుండడంతో బస్సులు నడపాలని నిర్ణయించింది. కంటైన్‌మెంట్ జోన్లు మినహా మిగతా ప్రాంతాలకు అంటే గ్రామాలు, జిల్లాలు, రాష్ట్ర రాజధానికి బస్సులు నడవనున్నాయి. అయితే, ప్రయాణికులను పరిమితంగానే అనుమతించడం, వ్యక్తిగత దూరం పాటించడం వంటి చర్యలు తీసుకోనున్నారు. అయితే, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై ఇప్పటి వరకు స్పష్టత లేదు.
Tags: TSRTC Telangana Corona Virus KCR

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *