ఏడుకొండలవాడి దర్శనంపై నూతన విధివిధానం!

Tirumala Tirupati Darshan Lockdown TTD

లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన తిరుమల శ్రీవారి దర్శనాలను పునఃప్రారంభించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం నూతన విధివిధానాలను రూపొందించనుంది. భక్తులను ఆలయంలోకి అనుమతించే విషయమై, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేలోగా, ముందస్తు ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం ఈ నెల 28న ప్రత్యేకంగా సమావేశం కానున్న టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలను తీసుకోనుందని తెలుస్తోంది.

ఇక కొత్త విధానాన్ని ప్రయోగాత్మకంగా టీటీడీ ఉద్యోగులతో ప్రారంభించాలన్న యోచనలో బోర్డు ఉంది. తొలుత గంటకు 500 మంది చొప్పున దర్శనాలకు అనుమతించాలని, ఆపై తిరుమల, తిరుపతిలోని స్థానికులకు 10 నుంచి 15 రోజుల పాటు స్వామి దర్శనం చేయించాలని అధికారులు భావిస్తున్నారు. తిరుమలలో రోజు మొత్తంలో 14 గంటల పాటు స్వామి దర్శనానికి సమయం ఉండగా, భక్తుల సంఖ్యను 7 వేలకు దాటనీయకుండా చేయాలని, భౌతిక దూరం పాటిస్తూ, భక్తులకు దర్శనాలను కల్పిస్తామని అధికారులు అంటున్నారు.

ప్రభుత్వాల నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే, దర్శన టికెట్లను ఆన్ లైన్ లో కేటాయించేందుకు స్లాట్ల విధానాన్ని కూడా అధికారులు రెడీ చేశారు. ఇక టికెట్లు ఉన్న వారిని మాత్రమే అలిపిరి నుంచి కొండపైకి అనుమతిస్తారు. ప్రతి భక్తుడికీ అలిపిరి వద్దే థర్మల్ స్కానింగ్, శానిటైజేషన్ తప్పనిసరి. నడక మార్గాల్లోనూ ఇదే పద్ధతిని అనుసరిస్తారు. భక్తులంతా విధిగా మాస్క్ లు, గ్లౌజులు ధరించాలి.

తిరుమలలో భక్తుల సంఖ్య అధికంగా ఉండే వైకుంఠం క్యూ కాంప్లెక్స్, రిసెప్షన్ తదితరాల వద్ద 50 ఏళ్లలోపు వయసున్న ఉద్యోగులను మాత్రమే నియమించాలని అధికారులు భావిస్తున్నారు. ఇక వ్యాపారులు సైతం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ దిశగా ఇప్పటికే బోర్డు చైర్మన్, ఈఓ, అడిషనల్ ఈఓలు సమీక్ష నిర్వహించగా, 28న జరిగే పాలక మండలి భేటీ తరువాత వారి నిర్ణయాలు అధికారికంగా వెలువడతాయని తెలుస్తోంది.
Tags: Tirumala Tirupati Darshan Lockdown TTD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *