‘కరోనా’తో అప్రమత్తంగా ఉండండి.. ఈ నెల 22న ‘జనతా కర్ఫ్యూ’ పాటించండి: ప్రధాని మోదీ పిలుపు

Narendra Modi,Prime Minister,Corona Virus,India

మానవజాతిని కరోనా వైరస్ సంక్షోభంలోకి నెట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ రోజు రాత్రి జాతి నుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, ‘కరోనా’తో ప్రపంచం మొత్తం గందరగోళంలో ఉందని, మొదటి ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులు తలెత్తాయని అన్నారు. ‘కరోనా’పై మనమంతా ఉమ్మడిగా పోరాడాలని, ఇందుకు దేశ ప్రజలు సహకరించాలని కోరారు.

‘కరోనా’పై దేశ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని, భారత్ పై దీని ప్రభావం ఉండదనుకోవడం చాలా తప్పు అని అన్నారు. కొన్ని వారాల్లో ఈ వైరస్ బారినపడే బాధితుల సంఖ్య పెరగబోతుందని, ‘కరోనా’కు మందులేదు కనుక సంకల్పం, అప్రమత్తతతో ఉండాలని ప్రజలకు పిలుపు నిచ్చారు.

మనం ఆరోగ్యంగా ఉంటే దేశం ఆరోగ్యంగా ఉన్నట్టేనని, రానున్న వారాల్లో ముఖ్యమైన పనులు ఉంటే తప్ప బయటకు వెళ్లొద్దని, సాధ్యమైనంత వరకూ ఇంటి నుంచే తమ పనులు చేసుకోవాలని, గుమిగూడొద్దని, ఒకరికొకరు సామాజిక దూరం పాటించాలని ప్రజలకు సూచించారు.

ఆ రోజు ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకూ ఎవరూ బయటకు రావొద్దు

‘కరోనా’ నివారణ కోసం ఈ నెల 22న ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలని పౌరులందరినీ కోరుతున్నానని అన్నారు. ఆ రోజున ఉదయం ఏడు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఎవరూ బయటకు రాకుండా కర్ఫ్యూ పాటిద్దామని, ఇది ప్రజల కోసం ప్రజల ద్వారా ప్రజలే చేసుకునే కర్ఫ్యూగా ఆయన అభివర్ణించారు.

22వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఇంటి గుమ్మాల్లో, కిటికీల వద్ద, బాల్కనీల్లో నిలబడి పౌరులు చప్పట్లు, గంటలు కొడుతూ ‘కరోనా’ నివారణ కోసం నిరంతరం శ్రమిస్తున్న వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, ఆర్మ్ డ్ ఫోర్సెస్, ఎయిర్ పోర్ట్ సిబ్బందికి మన సంఘీభావం తెలియజేద్దామని అన్నారు. ‘కరోనా’ మహమ్మారిని ఎదుర్కోవాలంటే ఈ కర్ఫ్యూ తప్పదని, ప్రతిరోజూ పది మందికి ఫోన్ చేసి ‘జనతా కర్ఫ్యూ’ గురించి చెప్పాలని, దీనిని యజ్ఞంలా నిర్వహించాలని సూచించారు. మనకు మనంగా విధించుకునే ఈ కర్ఫ్యూ ‘కరోనా’పై అతిపెద్ద యుద్ధంగా మోదీ అభివర్ణించారు. ‘జనతా కర్ఫ్యూ’ను ఆచరించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రావాలని, ఈ కర్ఫ్యూ సందేశం, ఉద్దేశం ప్రజలందరికీ చేరవేయాలని కోరారు.
Tags: Narendra Modi,Prime Minister,Corona Virus,India

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *