బీఎస్​–4 వాహనాలపై డిస్కౌంట్లు.. నెలాఖరులోగా అమ్ముకునేందుకు డీలర్ల ఆఫర్లు

BS-4, BS-6, Vehicles, Supreme Court, India, Cars, Bikes

ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా బీఎస్–4 వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లపై నిషేధం
గతంలోనే ఆదేశాలు ఇచ్చిన సుప్రీంకోర్టు
కార్లు, ఇతర ఫోర్ వీలర్లపై రూ.లక్ష వరకు, ద్విచక్ర వాహనాలపై రూ.10 వేల వరకు తగ్గింపు
వాహనాలు అమ్ముడుపోకుంటే నెలాఖరులో డిస్కౌంట్లను మరింత పెంచే చాన్స్
దేశవ్యాప్తంగా బీఎస్–4 వాహనాలను ధర తగ్గించి అమ్ముతున్నారు. కార్ల వంటి ఫోర్ వీలర్స్ మాత్రమేకాకుండా ద్విచక్ర వాహనాలు కూడా తక్కువ ధరకు ఇస్తున్నారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి బీఎస్‌-4 (భారత్ స్టేజీ 4) కేటగిరీ వాహనాలు విక్రయించవద్దని.. బీఎస్‌-6 వాహనాలు మాత్రమే అమ్మాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఇప్పటికే ఉన్న బీఎస్‌-4 వాహనాల స్టాక్ ను అమ్మేసుకునేందుకు డీలర్లు ధరలు తగ్గిస్తున్నారు.

2017లో ఇదే పరిస్థితి..
దేశవ్యాప్తంగా బీఎస్–3 వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లకు పెట్టిన గడువు ముగిసినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తింది. సుప్రీంకోర్టు గడువు పెంచుతుందేమోనన్న ఆశతో చాలా మంది డీలర్లు స్టాక్ ఉంచుకున్నారు. అయితే కోర్టు గడువు ఇవ్వకపోవడంతో ఉన్న వాహనాలను అమ్ముకునేందుకు భారీగా డిస్కౌంట్లు ప్రకటించారు. ద్విచక్ర వాహనాలను అయితే ఏకంగా రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు తగ్గించి ఇచ్చారు. దాంతో జనం షోరూమ్ ల ముందు బారులు తీరారు. కొన్ని చోట్ల పోలీసులను కూడా రంగంలోకి దింపాల్సి వచ్చింది. ఇప్పుడు మరీ అలాంటి పరిస్థితి రాకపోయినా వాహనాలపై డిస్కౌంట్లు మాత్రం మొదలయ్యాయి.
ఏమిటీ ‘బీఎస్‌’ ప్రమాణాలు?
వాహనాల్లో ఇంధన వినియోగ సామర్థ్యం, కాలుష్యం విడుదలకు సంబంధించిన ప్రమాణాలే బీఎస్ (భారత్ స్టేజీ) కేటగిరీలు. మన దేశంలో 2000వ సంవత్సరంలో ఈ ప్రమాణాలను అమలు చేయడం మొదలుపెట్టారు. మొదట ఆ ఏడాది బీఎస్‌–1 కేటగిరీ నిబంధనలు తెచ్చారు. 2010 నాటికి బీఎస్‌–3 నిబంధనలు అమలు చేశారు. తర్వాత చాలా జాప్యం జరిగింది. దానిపై సుప్రీంకోర్టులో కేసులు పడటంతో 2017 ఏప్రిల్ 1 నుంచి బీఎస్‌–4 వాహనాలను తప్పనిసరి చేయాలని ఆదేశించింది. అంతేగాకుండా అంతర్జాతీయ ప్రమాణాలను అందుకునేందుకు బీఎస్–5ను తప్పించి.. 2020 ఏప్రిల్ 1వ తేదీ నుంచి నేరుగా బీఎస్–6 నిబంధనలు అమలు చేయాలని స్పష్టం చేసింది. బీఎస్–4 తో పోలిస్తే బీఎస్–6 వాహనాలు పదో వంతు సల్ఫర్ ను, ఐదో వంతు మాత్రమే నైట్రోజన్ డయాక్సైడ్ ను విడుదల చేస్తాయి.

ఏ కంపెనీలు ఎంత వరకు?
హోండా కంపెనీ తన ప్రీమియం మోడళ్లపై రూ.3 లక్షల వరకు, సాధారణ మోడళ్లపై రూ.లక్ష వరకు డిస్కౌంట్లు ప్రకటించింది.
స్కోడా కంపెనీ మోడళ్లను బట్టి రూ. రెండున్నర లక్షల దాకా రాయితీలు ఇస్తోంది.
మారుతీ సుజుకీ రూ.75 వేల వరకు తగ్గింపును ఆఫర్ చేస్తోంది.
టాటా మోటార్స్ కూడా రూ.85 వేల దాకా తగ్గింపు ఇస్తోంది.
ద్విచక్ర వాహనాల కంపెనీలు అధికారికంగా ధరల తగ్గింపును ప్రకటించకున్నా షోరూమ్ లలో డిస్కౌంట్లు ఇస్తున్నాయి. త్వరలోనే అధికారికంగా ధరల తగ్గింపు ఇచ్చే అవకాశం ఉంది.
Tags: BS-4, BS-6, Vehicles, Supreme Court, India, Cars, Bikes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *