ఈఎస్‌ఐ స్కాం కేసులో మొత్తం ఏడుగురిని అరెస్టు చేశాం: ఏసీబీ జేడీ రవికుమార్

Atchannaidu Acb Andhra Pradesh ESI Scam

ఈఎస్‌ఐ కేసులో మొత్తం ఏడుగురిని అరెస్టు చేశామని అవినీతి నిరోధక శాఖ జేడీ రవికుమార్ తెలిపారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ దర్యాప్తులో మరిన్ని విషయాలు బయటపడతాయని తెలిపారు. ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్ల వ్యవహారంలో వీరు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించామని చెప్పారు.

హైకోర్టులో అచ్చెన్నాయుడితో పాటు రమేశ్ కుమార్ హౌస్‌ మోషన్‌ దాఖలు చేసినట్లు తమకు తెలిసిందని రవికుమార్ తెలిపారు. తాము కూడా న్యాయప్రకారం ముందుకు వెళ్తామని చెప్పారు. దాదాపు 150 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్లు వివరించారు.

పలు అంశాల్లో ప్రభుత్వానికి నష్టం జరిగినట్లు గుర్తించామని అన్నారు. ప్రభుత్వ అధికారులతో ప్రైవేటు వ్యక్తులు కుమ్మక్కై ప్రభుత్వానికి నష్టాన్ని తీసుకొచ్చారని ఆయన తెలిపారు. ఇందులో 19 మంది ప్రమేయం ఉన్నట్లు తాము ఇప్పటివరకు గుర్తించామని వివరించారు.

రమేశ్‌కుమార్‌తో పాటు అచ్చెన్నాయుడిని న్యాయమూర్తి ముందు హాజరుపర్చామని తెలిపారు. నేడు మరో ఐదుగురిని న్యాయమూర్తి ముందు హాజరుపర్చుతున్నామని వివరించారు. ఈ కేసులో విచారణ కొనసాగుతుందని చెప్పారు.
Tags: Atchannaidu, Acb Andhra Pradesh, ESI Scam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *