ఇవిగో ఆధారాలు… జగన్, ఇప్పుడేమంటావు?: చంద్రబాబు

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నేడు కరవు అంశం చర్చకు రాగా అధికారపక్ష నేతలు, టీడీపీ నాయకులపై తీవ్రస్థాయిలో దాడికి దిగిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడ్ని సైతం వదిలిపెట్టకుండా విమర్శల జడివాన కురిపించారు. దీనిపై చంద్రబాబు మంగళగిరిలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీలో కాళేశ్వరం గురించి చర్చకు రాగా, అప్పుడు కడుతుంటే మీరు గాడిదలు కాస్తున్నారా? అంటూ ముఖ్యమంత్రి ప్రశ్నించారని, పోలవరంపై చర్చ వస్తే మరో మంత్రి రూ.400 కోట్లు దొబ్బేశారంటూ అసభ్యకరంగా మాట్లాడాడని ఆవేదన వ్యక్తం చేశారు.

కరవు వంటి అత్యంత తీవ్రమైన అంశం చర్చకు వచ్చినప్పుడు సీఎం స్థాయి వ్యక్తి ఎంతో లోతుగా అధ్యయనం చేసి సమాధానం చెప్పాలని, లేకపోతే విమర్శ చేయాలని, ఇదేమీ లేకుండా హుందాతనం కోల్పోయి మరీ మాట్లాడారని చంద్రబాబు ఆరోపించారు. సున్నా వడ్డీ ఘనత తమదే అని చెప్పుకోవడం మరీ దారుణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆధారాలను మీడియా ముందుంచారు.

2014-15 బడ్జెట్ లో లక్ష రూపాయల లోపు పంట రుణాలు తీసుకున్న రైతులకు పూర్తిస్థాయిలో వడ్డీ రాయితీ, లక్ష నుంచి రూ.3 లక్షల లోపు రుణాలు తీసుకున్న రైతులకు పావలా వడ్డీ కొరకు రూ.230 కోట్లు ప్రతిపాదించడం జరిగిందని తెలిపారు. “2016-17 బడ్జెట్ లో వడ్డీలేని రుణాలు, పావలా వడ్డీ రుణాల కోసం రూ.177 కోట్లు ప్రతిపాదించాం. 2017-18 బడ్జెట్ లో లక్ష రూపాయల వరకు పంట రుణాలను సకాలంలో చెల్లించిన రైతులకు వడ్డీలేని రుణాల కోసం రూ.172 కోట్ల ప్రతిపాదనలు పెట్టాం. 2018-19 బడ్జెట్ లో కూడా లక్ష రూపాయల వరకు పంట రుణాలను సక్రమంగా చెల్లించిన రైతులకు వడ్డీలేని రుణాల కోసం రూ.172 కోట్లు ప్రతిపాదనలు పెట్టాం.

కానీ జగన్ ఈ సున్నా వడ్డీ పథకం లేనేలేదని ఇవాళ అసెంబ్లీ సాక్షిగా చెబుతున్నారు. ఇదేదో కొత్తగా ఈయనే సృష్టించినట్టు మాట్లాడారు. ఇది ఇప్పటిది కాదు. కిరణ్ కుమార్ రెడ్డి హయాం నుంచి వస్తున్నట్టు జీవోల రూపంలో ఉంది. మా పార్టీ నేత రామానాయుడు కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు” అంటూ తమపై వచ్చిన విమర్శలకు చంద్రబాబు దీటుగా బదులిచ్చారు. ఈ సందర్భంగా కొన్ని కీలకమైన పత్రాలను కూడా ఆయన మీడియా ప్రతినిధులకు అందజేశారు.
Tags: Chandrababu,Jagan, Andhra Pradesh, Telugudesam, YSRCP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *